ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో డార్క్ ప్యాట్రన్స్.. జేబును ఖాళీ చేయకుండా వదలవు

డార్క్ ప్యాటర్న్‌లు లేదా మోసపూరిత నమూనాలు అనేది యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు వినియోగదారులను లేదా కొనుగోలుదారులను తాము ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా తప్పనిసరిగా ఆ వస్తువులు లేదా సర్వీస్ ను తీసుకునే విధంగా..

  • KVD varma
  • Last Updated : July 16, 2023, 17:18 IST

అమర్ యువ గ్రాడ్యుయేట్. అతను ఓ పెద్ద మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం అతనికి లక్షల రూపాయలు ఆదాయం తీసుకువస్తోంది. అయినా కానీ.. అతనిక సినిమా నిర్మాణం అంటే విపరీతమైన ఇష్టం. దీంతో వీకెండ్స్ లో దీనిని ఒక హాబీగా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, తన సినిమా మేకింగ్ జర్నీని ఎక్కడ, ఎలా ప్రారంభించాలో తెలియలేదు. అందుకోసం అతను ఆన్‌లైన్‌లో ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాల కోసం వెతకడం ద్వారా తన ఆప్షన్స్ చూసుకోవాలని అనుకున్నాడు.

అమర్ ఆలోచన మంచిదే. కానీ.. బెస్ట్ బుక్ కోసం అతను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లో వెతుకుతున్నపుడు లెక్కలేనన్ని ఆప్షన్స్ కనిపించాయి. దీంతో అతనిలో గందరగోళం పెరిగిపోయింది. అన్నీ ఆప్షన్స్ నుంచి ఏది బెస్ట్ అనేది ఎలా ఎంచుకోవాలో తలియక తికమక పడ్డాడు. అయినా కొద్దిగా ఫిల్టర్ చేసి అన్నీ ఆప్షన్స్ మధ్యలో ఓ రెండు పుస్తకాలను సెలెక్ట్ చేసుకుని కార్ట్ లో పెట్టుకున్నాడు. మరింత రీసెర్చ్ చేసి అప్పుడు ఆ పుస్తకాలను కొనాలని అనుకున్నాడు.

ఒకరోజు గడిచింది. రెండోరోజు అమర్‌కి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి “మీ కార్ట్‌లో ఇంకా 2 వస్తువులు ఉన్నాయి.. రేపటి నుంచి ధర పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయండి” అని రాసి ఉన్న నోటిఫికేషన్ వచ్చింది. అమర్ కంగారు పడి షాక్ అయ్యాడు. వస్తువుల ధరలు కేవలం అంత తక్కువ సమయంలో అదీ 24 గంటల్లో ఎలా పెరుగుతాయని అతను ఆశ్చర్యపోయాడు.ఇప్పుడు అమర్ ను ఆ ఈ కామర్స్ సంస్థ తప్పనిసరిగా పుస్తకాలు కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఇప్పుడు అమర్ కొనుగోలు చేస్తాడా లేదా అనేది అతని ఇష్టం. కానీ అమర్‌ను ప్రభావితం చేయడానికి లేదా బలవంతం చేయడానికి ఇ-కామర్స్ కంపెనీ ఇక్కడ ఉపయోగించిన వ్యూహాన్ని డార్క్ ప్యాట్రన్ అని అంటారు.

అసలు ఈ డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

డార్క్ ప్యాటర్న్‌లు లేదా మోసపూరిత నమూనాలు అనేది యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు వినియోగదారులను లేదా కొనుగోలుదారులను తాము ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా తప్పనిసరిగా ఆ వస్తువులు లేదా సర్వీస్ ను తీసుకునే విధంగా ఇరికించే ఒక వ్యాపార పద్ధతి. ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్ నుంచి కోడి గుడ్లను కొనాలని అనుకున్నారు. మీరు ఒకటి లేదా రెండు కోడి గుడ్లు కొనాలని చూస్తున్నారు. వాటి ధర 12 లేదా 13 రూపయలు ఉంది. మీరు రెండు గుడ్లను కార్ట్ కి యాడ్ చేశారు. తరువాత కార్ట్ కి వెళ్ళి వీటిని కొనడానికి పేమెంట్ చేద్దాం అనుకున్నారు. అపుడు మీ కార్ట్ వద్ద మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రెండు కోడి గుడ్లను 12 రూపాయలకు కొనండి.. ఆరు కోడి గుడ్లను 24 రూపాయలకు కొనండి. 10 కోడి గుడ్లను 36 రూపాయలకు కొనండి అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆలోచనలో పడతారు. అంతేకాదు.. మీరు కచ్చితంగా 10 గుడ్లను కొందామనే అనుకుంటారు. అంటే మీరు 12 రూపాయలు ఖర్చు చేయాలనుకుని అవసరం లేకపోయినా మరో 24 రూపాయలు అదనంగా ఖర్చు చేస్తారు.

మరొక రకమైన డార్క్ ప్యాటర్న్‌ షేమింగ్‌ను నిర్ధారించడం. ఇది హాస్పిటాలిటీ పరిశ్రమ నుంచి తీసుకుందాం. మీరు ట్రావెల్ అగ్రిగేటర్ నుంచి హోటల్ గదిని బుక్ చేస్తున్నారని అనుకుందాం. ఇప్పుడు అగ్రిగేటర్ ఒక పాప్ అప్ యాడ్‌ను షో చేస్తుంది. “మీలాగే 25 మంది ప్రస్తుతం ఇదే పేజీని చూస్తున్నారు. ఇప్పుడే ఈ హోటల్ గదిని బుక్ చేయండి .. 15% తగ్గింపు పొందండి, లేకుంటే ఒక గది మాత్రమే మిగిలి ఉన్నందున మీరు మరింత చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి మీరు త్వరపడటానికి బదులుగా ఎందుకు ఆలోచిస్తున్నారు?” అంటూ మిమ్మల్ని తనవైపు ఆకర్షించేలా బ్లింక్ అవుతుంది. నిజానికి ఇది మిమ్మల్ని అవమానించడం లేదా ఆర్డర్ చేయకుండా ఊరికే చెక్ చేస్తున్నందున మిమ్మల్ని దోషిగా భావించేలా చేసి తప్పనిసరిగా బుక్ చేసుకునే విధంగా ప్రేరేపించడం అని చెప్పవచ్చు.

ఇ-కామర్స్ కంపెనీలు ఉపయోగించే ఈ విభిన్న డార్క్ ప్యాటర్న్‌లన్నింటి పై ప్రభుత్వం దృష్టి సారించింది. వినియోగదారులను మోసం చేసే లేదా వారి ఎంపికలను తారుమారు చేసే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించవద్దని ప్రభుత్వం వారిని కోరింది. వినియోగదారులను రక్షించేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు 17 మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇ-కామర్స్ కంపెనీలు ఉపయోగించే తొమ్మిది రకాల డార్క్ ప్యాటర్న్‌లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. అవేమిటో చూద్దాం.

(i) తప్పుడు అవసరం -అది అవసరం లేదా కొరత ఉన్నట్టుగా పరిషటిటి సృష్టించడం ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులను ఒత్తిడి చేస్తుంది.

(ii) బాస్కెట్ స్నీకింగ్- కస్టమర్ సమ్మతి లేకుండా అదనపు ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ లు జోడించడం

(iii) షేమింగ్‌ని నిర్ధారించండి- వినియోగదారులను కట్టుబడి ఉండేలా చేయడానికి తప్పుడు ప్రచారం చేయడం.. లేదా తన సర్వీస్ తీసుకోనందుకు వినియోగదారులను విమర్శించడం.

(iv) బలవంతపు చర్య-కస్టమర్‌ను వారు తీసుకోకూడదనుకునే చర్య తీసుకోమని బలవంతం చేయడం

(v) నగ్గింగ్-నిరంతర విమర్శలు, ఫిర్యాదులు .. చర్య కోసం అభ్యర్థన.

(vi) సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్- దీనిలో సర్వీస్ కోసం సైన్ అప్ చేయడం సులభం కానీ నిష్క్రమించడం కష్టం.

(vii) బైట్ & స్విచ్- ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ప్రకటించడం. కానీ మరొకటి పంపిణీ చేయడం. తరచుగా తక్కువ నాణ్యత కలిగిన సర్వీస్ లేదా వస్తువులను అందించడం .

(viii) దాచిన ఖర్చులు-వినియోగదారులు కొనుగోలు చేయడానికి సిద్దపడే వరకూ అదనపు ఖర్చులను దాచడం

(ix) మారువేషంలో ఉన్న ప్రకటనలు- అంటే వార్తా కథనాలు లేదా వినియోగదారు రూపొందించిన కంటెంట్‌గా కనిపించేలా రూపొందించిన ప్రకటనలు.

భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ mktగా మారడంతోపాటు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వానికి చాలా ముఖ్యంగా మారింది. వినియోగదారులు తమ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి యాప్‌లు .. వెబ్‌సైట్‌లు ఉపయోగించే ఉపాయాలపై తమకుతామే అవగాహన కల్పించుకోవాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. వినియోగదారులు కూడా తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే జేబులు అనవసరంగా ఖాళీ అయిపోతాయి.

Published: July 16, 2023, 17:18 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.