తగ్గుతున్న డెబిట్ కార్డుల వినియోగం..పెరుగుతున్న UPI పేమెంట్లు

కోవిడ్-19 తర్వాత డెబిట్ కార్డ్ వినియోగం చాలా తగ్గింది. దీనికి కారణం UPI ద్వారా పేమెంట్స్ చేసుకునే సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రావడమే. అయితే పేమెంట్ అగ్రిగేటర్లు, వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీల నుంచి తమ..

  • KVD varma
  • Last Updated : June 11, 2023, 14:45 IST

కోవిడ్-19 తర్వాత డెబిట్ కార్డ్ వినియోగం చాలా తగ్గింది. దీనికి కారణం UPI ద్వారా పేమెంట్స్ చేసుకునే సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రావడమే. అయితే పేమెంట్ అగ్రిగేటర్లు, వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీల నుంచి తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆర్జించే బ్యాంకులు ఇప్పుడు ఈ విధానంపై కంప్లైంట్స్ చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే వారి కస్టమర్‌లు ఇప్పుడు డెబిట్ కార్డ్‌ల నుంచి UPIకి మారారు. UPI చాలా కాలంగా ఉన్నప్పటికీ, కోవిడ్ సమయంలో మాత్రమే ప్రజలు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ పద్ధతులను ఉపయోగించడం ప్రారంభించారు. దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు UPI లేని జీవితాన్ని మనం ఊహించలేము.

దీన్ని బలపరిచేలా డెబిట్ కార్డుల ద్వారా మొత్తం 7.2 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపాయి. యుపిఐ ట్రాన్సాక్షన్స్ విలువ 139 లక్షల కోట్ల రూపాయలు. UPI అత్యంత ప్రాధాన్య పేమెంట్ మోడ్‌గా మారిందని, వినియోగదారులు డెబిట్ కార్డ్‌ల వినియోగాన్ని తగ్గించుకున్నారని స్పష్టమవుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు.. వినియోగదారులు UPI ద్వారా 1900 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేశారు.

ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్‌ను చూసినప్పుడు, డెబిట్ కార్డ్‌ల వినియోగం కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది. FY 21లో ఈ సంఖ్య 4 బిలియన్లకు చేరింది. FY 22లో వాల్యూమ్ 3.9 బిలియన్లకు పడిపోయింది. అలాగే FY 23 నాటికి ట్రాన్సాక్షన్స్ పరిమాణం 3.4 బిలియన్లకు తగ్గింది. దీనికి విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో UPI ద్వారా 83.8 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.

గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు వ్యక్తి ఏడాదికి సగటున 16 సార్లు ATMకి వెళ్లేవాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ATMని 8 సార్లు మాత్రమే ఉపయోగిస్తున్నాడని SBI కి చెందిన ECO పరిశోధన నివేదిక చెబుతోంది. రాబోయే కాలంలో UPI వినియోగం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. కన్సల్టింగ్ దిగ్గజం PWC ఇండియా నివేదిక ప్రకారం.. 2026-27 నాటికి దేశంలో ప్రతిరోజూ UPI ద్వారా 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. UPI ట్రాన్సాక్షన్స్ పెరుగుదలతో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో దాని వాటా 2026-27 నాటికి 90%కి పెరుగుతుందని కూడా చెబుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 75 శాతంగా ఉంది.

డెబిట్ కార్డుల వినియోగం ఎందుకు తగ్గుతోంది? అనేది చూద్దాం. యూపీఐలో 50 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. UPI పేమెంట్లకు అతిపెద్ద బూస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఉంది. ఎందుకంటే ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరుగుతోంది. డెబిట్ కార్డుల మాదిరిగా వాలెట్ లేదా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పెద్ద రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి చిన్న వ్యాపారుల వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్‌లు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. వీటి ద్వారా క్షణాల్లో ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. UPIని ఉపయోగించడం కోసం కస్టమర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డులను వినియోగిస్తే వినియోగదారులు బ్యాంకులకు ఆన్యువల్ ఫీజ్ చెల్లించాలి. ప్రస్తుతం దేశంలో పీఓఎస్ టెర్మినల్స్ కంటే ఎక్కువ క్యూఆర్‌లు ఉన్నాయి.

మరోవైపు వ్యాపారులు క్యూఆర్ కోడ్‌ మరింత సులభంగా మారిందని చెబుతున్నారు. తక్షణ పేమెంట్, సులభమైన పేమెంట్ సేకరణ, త్వరిత పరిష్కారం, తక్కువ ధర, అధిక భద్రత వంటి అంశాల కారణంగా వారు కూడా UPIని ఇష్టపడుతున్నారు. UPI పేమెంట్స్ వేగంగా పెరుగుతుండటంతో డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గిపోతోంది. అలా గే రాబోయే భవిష్యత్తును పరిశీలిస్తే, డెబిట్ కార్డ్‌లకు ముగింపు ఇంకెంతో దూరంలో లేనట్లు కనిపిస్తోంది.

Published: June 11, 2023, 14:45 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.