ఈ డొనేషన్ చాలా కాస్ట్లీ గురూ!

మీరు విరాళం ఇస్తున్న పార్టీ.. రిజిస్టర్ అయినా.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలలో ఉందేమో చెక్ చేయవచ్చు. పార్టీ పాన్ కార్డ్‌ని పొందడం

చిన్న రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్న పన్ను ఎగవేతదారులపై ఆదాయపు పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇప్పటివరకు దాదాపు 5000 నోటీసులను పంపించారు. ఈ నోటీసులు వ్యక్తులతో పాటు కంపెనీలకు కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో, మరింత మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు రావచ్చు. తెలియని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా.. పన్ను ఎగవేత ఎలా జరుగుతోందో.. ఈ మొత్తం గేమ్ ఎలా నడుస్తోందో.. ఆదాయపు పన్ను శాఖ దానిపై ఎలా స్పందించిందో చూద్దాం.

ఆదాయపు పన్ను శాఖ అనేక మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేసింది. రిజిస్టర్ అయినా గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారే వీరు. ఈ నోటీసులు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు పంపించారు. చిన్న రాజకీయ పార్టీలు, తెలియని పార్టీలకు ఇచ్చే ఈ విరాళాలు పన్ను ఎగవేత మరియు మనీ లాండరింగ్ కోసం కాదా అని ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లో కనీసం 20 రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. కానీ ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందలేదు. గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలుగా వీటిని చూస్తారు. గుర్తింపు పొందలేదు, అంటే వారు శాసనసభ లేదా జాతీయ ఎన్నికలలో పోటీ చేయలేదు లేదా ఎన్నికలలో నిర్దిష్ట శాతం ఓట్లను పొందలేదు అని అర్థం.

ఇచ్చిన విరాళాలపై ఆదాయపు పన్ను శాఖకు అనుమానం వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయంతో అవి పొంతన కుదరడం లేదు. అంటే వెల్లడించిన ఆదాయంలో.. ఈ పార్టీలు కొంత డబ్బును మినహాయించి… మిగిలిన మొత్తాన్ని పన్ను చెల్లింపుదారులకు నగదు రూపంలో తిరిగి ఇచ్చాయని ఆ శాఖ అనుమానిస్తోంది. దీన్నే బోగస్ విరాళం అంటారు. కొన్ని సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో దాదాపు 80 శాతాన్ని విరాళాల రూపంలో.. పేరు కూడా సరిగ్గా రిజిస్టర్ చేసుకోని పార్టీలకు ఇచ్చారు.

పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం 10 లక్షల రూపాయలు అని అనుకుందాం. వారు ఒక రాజకీయ పార్టీకి 2 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తే, ఆ మేరకు వారు 2 లక్షల రూపాయల తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది పన్ను ఆదా కోసం తీసుకున్న ఆరోగ్యకరమైన చర్య. అయితే ఎవరైనా 10 లక్షల రూపాయలు సంపాదించి.. అందులో 8 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తే, ఆదాయపు పన్ను శాఖ కచ్చితంగా దీనిని అనుమానిస్తుంది. ఈ ప్రక్రియలో, చాలా సార్లు, నిజమైన పన్ను చెల్లింపుదారులు కూడా ఆదాయపు పన్ను నోటీసులను అందుకుంటారు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80GGC.. రాజకీయ పార్టీలకు విరాళాల కోసం పన్ను మినహాయింపును అందిస్తుంది. ఈ నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి రాజకీయ పార్టీకి లేదా ఎన్నికల ట్రస్ట్‌కి విరాళం ఇస్తే, వారు విరాళంలో 100 శాతం తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. అయితే , ఒక వ్యక్తి చేసిన రాజకీయ విరాళం.. అంటే మొత్తం తగ్గింపు, వారి మొత్తం ఆదాయాన్ని మించకూడదు. మరోవైపు, రాజకీయ విరాళాల కోసం కంపెనీలు సెక్షన్ 80GGB కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.

మినహాయింపులకు కొన్ని షరతులు ఉన్నాయి. ముందుగా, విరాళాన్ని స్వీకరించే రాజకీయ పార్టీ ప్రజా ప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A ప్రకారం తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. రెండవది, విరాళం నగదు లేదా వస్తు రూపంలో ఉండకూడదు. అంటే అది వస్తువులు లేదా సేవల రూపంలో ఉండకూడదు.

రాజకీయ విరాళాల వాస్తవికతను నిర్ధారించడానికి ఆదాయపు పన్ను శాఖ సాక్ష్యాధారాలను కోరవచ్చు. ప్రామాణికతను నిరూపించలేకపోతే.. సదరు వ్యకిక్తి పన్ను స్లాబ్ ప్రకారం మినహాయింపు ఇచ్చిన మొత్తానికి తిరిగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఆలస్యంగా చెల్లించినందుకు వడ్డీ ఉంటుంది. ఇంకా ఆదాయాన్ని తక్కువగా చూపించడం, లేదా తప్పుగా రిపోర్ట్ చేయడం వంటి సందర్భాల్లో, సెక్షన్ 270A కింద జరిమానాలు ఉంటాయి. తక్కువగా చూపించిన సందర్భాల్లో.. అలా చూపించిన మొత్తం ఆదాయంపై 50 శాతం పన్ను ఉంటుంది. ఒకవేళ తప్పుగా చూపిస్తే.. అలాంటి సందర్భాల్లో పెనాల్టీ 200 శాతం ఉంటుంది.

రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చేటప్పుడు, పన్ను చెల్లింపుదారులు దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అడగాలి. ఇది రాజకీయ పార్టీ ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయిందో లేదో నిర్ధారిస్తుంది. రిజిస్ట్రేషన్‌ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ eci.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

మీరు విరాళం ఇస్తున్న పార్టీ.. రిజిస్టర్ అయినా.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలలో ఉందేమో చెక్ చేయవచ్చు. పార్టీ పాన్ కార్డ్‌ని పొందడం కూడా చాలా అవసరం. అదనంగా, దీని కోసం రసీదుని తీసుకోండి. పార్టీకి చేసిన విరాళం, ఆ మొత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవాటి ద్వారా విరాళం చెల్లించండి. దీని ప్రయోజనం ఏమిటంటే, నోటీసు అందితే, ట్యాక్స్ పేయర్స్.. ఆధారాలుగా వీటిని సమర్పించవచ్చు.

పన్ను ఆదా, పన్ను ఎగవేత మధ్య స్పష్టమైన రేఖ ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ లావాదేవీ చట్టబద్ధమైనదైతే, ఒక రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళం.. పన్నులను ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఫేక్ విరాళం అయితే.. పన్ను ఆదా కాదు.. వడ్డీ, జరిమానాలతో పాటు భారీ పన్నులను కూడా విధిస్తారు.

Published: March 1, 2024, 19:09 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.