వడ్డీపై వచ్చే ఆదాయనికి ఎవరుట్యాక్స్ కట్టాలో తెలుసా?

మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి వచ్చే వడ్డీ అంటే FDపై మీకు పూర్తిగా పన్ను విధిస్తారు.

సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా ఆదాయం
వస్తుంది. జీతం, వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చే ఆదాయంపై పన్ను విధించినట్లే, వడ్డీ ఆదాయంపై కూడా పన్ను
చెల్లించాలి. అయితే , వడ్డీ ఆదాయంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చని మీకు తెలుసా? మీరు దానికి అర్హులు
అయితే ఈ సదుపాయం పొందవచ్చు. వడ్డీ ఆదాయం విషయంలో సాధారణ వ్యక్తుతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లు
అంటే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి.. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంతో ఎక్కువ
ప్రయోజనం ఉంటుంది. మీ పెట్టుబడి పన్ను మినహాయింపుకు అర్హమైనది కాదా… దాని నుండి మీరు ఎంత
ప్రయోజనం పొందవచ్చో చూద్దాం.

దాదాపు ప్రతి వ్యక్తికీ పొదుపు ఖాతా ఉంటుంది. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉన్నాయి.
ఎక్కువ ఖాతాలు ఉంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. దీంతో పన్ను కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం, ఒక వ్యక్తి బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో ఉంచిన డబ్బుపై
వచ్చిన వడ్డీపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.
10,000 వరకు వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. మినహాయింపు పరిమితి ప్రతి సేవింగ్స్ అకౌంట్ కు
వేరుగా ఉండదు. అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల సేవింగ్స్ అకౌంట్స్ నుండి పొందిన వడ్డీ మొత్తం ఇందులో కలిపే
ఉంటుంది.

ఈ మినహాయింపు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు, HUF అంటే హిందూ అవిభాజ్య
కుటుంబం… టైమ్ డిపాజిట్లు అంటే FD, RDలు.. సెక్షన్ 80TTAలో కవర్ అవ్వవు.

సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రూ. 10,000 దాటితే, అప్పుడు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంపై పన్ను ఉంటుంది.
పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ అకౌంట్స్ నుండి పొందిన వడ్డీ మొత్తాన్ని ‘ఇతర
వనరుల నుండి వచ్చే ఆదాయం’ విభాగంలో చూపాలి. తగ్గింపు తర్వాత మిగిలి ఉన్న వడ్డీ మొత్తం మీ
ఆదాయాలకు కలుపుతారు. దానిపై పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ల కోసం ఆదాయపు పన్ను చట్టంలో ప్రత్యేక సెక్షన్ 80TTB ఉంది. సెక్షన్ 80TTB కింద,
సీనియర్ సిటిజన్లు సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీపై రూ.50,000
వరకు తగ్గింపును పొందవచ్చు. సీనియర్ సిటిజన్ లకు రూ. 50,000 వడ్డీ ఆదాయం వరకు పన్ను లేదు.

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అంటే HUF,
నాన్-రెసిడెంట్ భారతీయులు అంటే NRIలకు సెక్షన్ 80TTB ప్రయోజనం వర్తించదు.

వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి, మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్
చేసేటప్పుడు వడ్డీ గురించి సమాచారాన్ని ఇవ్వాలి. మీరు బ్యాంక్ స్టేట్‌మెంట్, వడ్డీ సర్టిఫికేట్, ఫారం 26AS ద్వారా
వడ్డీ ఆదాయాన్ని నిర్ధారించాలి. ఏదైనా తేడా ఉంటే, మీరు వెంటనే బ్యాంక్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఫీడ్‌బ్యాక్
సిస్టమ్‌కు తెలియజేయాలి. దాన్ని సరిదిద్దేలా చూడాలి.

మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి వచ్చే వడ్డీ అంటే FDపై
మీకు పూర్తిగా పన్ను విధిస్తారు. సీనియర్ సిటిజన్ లాగా, మీరు సెక్షన్ 80TTB ప్రయోజనాన్ని పొందలేరు. చాలా
మంది బ్యాంకు నుండి వడ్డీని పొందుతారు. కానీ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా.. ఆదాయపు పన్ను
రిటర్న్‌లో.. ఈ ఆదాయం గురించి సమాచారాన్ని ఇవ్వరు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు దానిని మీ రిటర్న్‌లో
చూపించాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వద్ద మీ ఆదాయాల గురించి సమాచారం
ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా మీ ఆదాయాన్ని చూపించకపోతే.. దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి.

Published: March 30, 2024, 18:33 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.