PPF, SSYలో ఈ చిన్న తప్పులతో ఎలాంటి నష్టం ఉంటుంది?

కొత్త పన్ను విధానంలో.. PPF, సుకన్య లో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు. అయినా, మీరు మార్చి 31వ తేదీ డెడ్‌లైన్‌ని

మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉందా? మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో
అందులో డబ్బును జమ చేయలేదా? అయినా అకౌంట్ ను యాక్టివ్‌గా ఉంచాలా? అయితే మీకు మార్చి 31వ తేదీ
వరకు మాత్రమే సమయం ఉంది. మీరు కనీస వార్షిక డిపాజిట్‌ను చేయకపోయినట్లయితే.. మీ అకౌంట్ ఫ్రీజ్
అయిపోయే ఛాన్సుంది. దీనికి మీరు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కోల్పోవచ్చు.
కాబట్టి మీరు ఈ అకౌంట్స్ లో సంవత్సరానికి డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం ఎంతో చూద్దాం. ఎంత
జరిమానా విధిస్తారో తెలుసుకుందాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

PPF, SSYలో కనీస డిపాజిట్‌కి చివరి తేదీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్చి 31. కాబట్టి, FY 24కి, ఈ తేదీ మార్చి
31, 2024. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం, PPF అకౌంట్ హోల్డర్‌లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో
కనీసం 500 రూపాయలను వారి ఖాతాలో జమ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, PPF ఖాతా
నిలిచిపోతుంది.

మీ అకౌంట్ క్లోజ్ అయితే, మీరు లోన్, పాక్షిక ఉపసంహరణ సౌకర్యాలను పొందలేరు. అంతేకాకుండా, మీరు
మునుపటి ఖాతాను పూర్తిగా మూసివేయకుండా.. మీ పేరు మీద మరో అకౌంట్ ను ఓపెన్ చేయలేరు.

క్లోజ్ అయిన PPF అకౌంట్ మళ్లీ ఓపెన్ అవుతుంది. కానీ మీరు ప్రతి సంవత్సరం 50 రూపాయల పెనాల్టీని
చెల్లించాలి. పెనాల్టీతో పాటు, ప్రతి సంవత్సరం కనీసం 500 రూపాయల డిపాజిట్ కూడా చేయాలి. కనీస
డిపాజిట్‌ను నిర్వహించనందుకు అకౌంట్ ను మూసేస్తే.. దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు ప్రతి సంవత్సరం
550 రూపాయలు చెల్లించాలి.

సుకన్య సమృద్ధి యోజన.. కూతురి కెరీర్, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయడానికి మంచి ఆప్షన్ గా పరిగణిస్తారు.
మీకు SSY ఖాతా ఉంటే, మీరు ప్రతీ సంవత్సరం కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు ఈ డబ్బును
డిపాజిట్ చేయకపోతే, ఆ అకౌంట్ ను డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. అకౌంట్ ను తిరిగి యాక్టివ్ చేయడానికి మీరు ప్రతి
సంవత్సరం 50 రూపాయల పెనాల్టీని చెల్లించాలి. అదనంగా, మీరు ప్రతి సంవత్సరానికి కనీసం 250 రూపాయల
డిపాజిట్ చేయాలి.

మీరు FY24లో పాత పన్ను విధానంలో ట్యాక్స్ లను ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. PPF, సుకన్య వంటి
పథకాలు పన్ను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C
ప్రకారం.. PPF, సుకన్య లో 1.5 లక్షల రూపాయల పెట్టుబడులకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

80C కింద మినహాయింపు పొందేందుకు, మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి.. మార్చి 31, 2024లోపు
పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు చివరి తేదీ మార్చి 31. మీరు ఈ
తేదీలోపు పెట్టుబడి పెట్టకపోతే, మీరు మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. అంటే మీరు ఎక్కువ పన్ను
చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఏప్రిల్ 1, 2023 నుండి, కొత్త పన్ను
విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను రివైజ్ చేశారు. ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 లక్షల
రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచారు. ఇందులో ప్రామాణిక తగ్గింపు కూడా ఉంటుంది. కొత్త
విధానంలో, 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు.

కొత్త పన్ను విధానంలో.. PPF, సుకన్య లో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు. అయినా, మీరు మార్చి
31వ తేదీ డెడ్‌లైన్‌ని మిస్ అయితే మీరు ఇప్పటికీ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం చాలా
మంది పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులతో సహా, వారి సౌలభ్యం ఆధారంగా ప్రతి సంవత్సరం కొత్త, పాత పన్ను
విధానాలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. పన్ను ఆదా చేయడానికి, మార్చి 31లోపు PPF, సుకన్య, 80C కింద
ఉన్న ఇతర ఆప్షన్‌లలో పెట్టుబడి పెట్టాలని నిర్ధారించుకోండి. మరో మాటలో చెప్పాలంటే, మీకు కేవలం ఒక నెల
మాత్రమే మిగిలి ఉంది.

Published: March 4, 2024, 17:59 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.