Home Loan Agreement: హోమ్ లోన్ అగ్రిమెంట్ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దీపక్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇల్లు కొంటున్నాడు. అగ్రిమెంట్ పై సంతకాల కోసం లోన్ అగ్రిమెంట్ కిట్‌తో బ్యాంక్ అధికారులు అతని..

  • KVD varma
  • Last Updated : October 13, 2023, 15:24 IST

దీపక్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇల్లు కొంటున్నాడు. అగ్రిమెంట్ పై సంతకాల కోసం లోన్ అగ్రిమెంట్ కిట్‌తో బ్యాంక్ అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. దీపక్ ఆలోచించకుండా దాదాపు 60 పేజీల పత్రాలపై సంతకం చేశాడు. ఆ తరువాత అతనికి తెలిసింది. హోమ్ లోన్‌తో పాటు రూ.1.10 లక్షల ఒకే ప్రీమియంతో మూడు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అతనికి ఇచ్చారు. దీని వలన దీపక్ హోమ్ లోన్ ఈఎంఐ రూ. 965 పెరిగింది.

చూడటానికి ఇది చిన్న మొత్తంలా కనిపిస్తోంది. కానీ.. 20 ఏళ్ల లోన్ పిరియడ్‌లో ప్రతి నెలా దీపక్ తిరిగి చెల్లించే మొత్తం రూ. 2.31 లక్షలు అవుతుంది. దీపక్ కు ఇప్పటికే కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా? దీపక్ లా చదవకుండా డాక్యుమెంట్స్ పై గుడ్డిగా సంతకం చేసేయవద్దు.

హోమ్ లోన్ అగ్రిమెంట్ అనేది లోన్‌కి సంబంధించిన నిబంధనలు.. షరతులతో బ్యాంక్ – కస్టమర్ల మధ్య బంధాన్ని ఏర్పరిచే డాక్యుమెంట్. కస్టమర్ ఒక్కసారి ఆ అగ్రిమెంట్ పై సంతకం చేస్తే.. అందులో ఉన్న ప్రతి షరతుకు కస్టమర్ బాధ్యుడు అవుతాడు. దీని నుంచి వెనక్కి వెళ్లడం జరిగే పని కాదు. అందుకే.. బ్యాంక్ తో లోన్ విషయంలో చేసుకునే అగ్రిమెంట్ చదవడానికి సమయం తీసుకుని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి తరువాత మాత్రమే సంతకం చేయాలి.

ఇప్పుడు హోమ్ లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటో మనం అర్థం చేసుకుందాం. హోమ్ లోన్ 10 నుంచి 20 సంవత్సరాల సుదీర్ఘ కాలవ్యవధిని కలిగి ఉంది. లోన్ ఒప్పందం వివిధ ఛార్జీల గురించిన వివరాలను కలిగి ఉంటుంది. తప్పిన ఈఎంఐపై పెనాల్టీ – వడ్డీ మొదలైన వాటిని వివరిస్తారు.

బ్యాంకుకు తెలియజేయకుండానే ఇల్లు అద్దెకు లేదా లీజుకు ఇచ్చినట్లయితే ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది వంటి విషయాలు పేర్కొంటారు. అలాగే కొన్నితప్పనిసరి పరిస్థితులు కూడా ఉండవచ్చు. అప్పుడు బ్యాంక్ కొన్ని రకాల ఫీజులు వసూలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకుని, మరొక నగరంలో నివసించడం ప్రారంభించినట్లయితే, మీరు దాని గురించి బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఇటువంటి విషయాలు అన్నీ అగ్రిమెంట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని బ్యాంక్ కు చెప్పకపోతే మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

అదేవిధంగా, మీరు EMI చెల్లించడానికి బ్యాంకులను మార్చినట్లయితే అంటే ఒక బ్యాంక్ నుంచి చెల్లిస్తున్నEMI వేరే బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తే దాన్నిపై అదనపు ఛార్జీ విధించవచ్చు. అలాగే ఫ్లోటింగ్ రేట్ లోన్ ప్రీపేమెంట్‌పై బ్యాంకులు ఎలాంటి ఫీజులను విధించవని గుర్తుంచుకోండి.

మీరు ఫిక్స్‌డ్ రేట్ లోన్‌ను ప్రీపే చేయడానికి లోన్ తీసుకుంటుంటే.. అప్పుడు ఫీజు వివరాలను అగ్రిమెంట్ లో పేర్కొనవచ్చు. అటువంటి పరిస్థితులను చదవడానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మీరు భవిష్యత్తులో బాగా ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా లోన్ తీసుకున్నవారు సమయానికి EMI చెల్లించనప్పుడు బ్యాంకు అతన్ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుంది. ఒకవేళ 90 రోజుల పాటు EMI చెల్లించకపోతే.. లోన్ ఎకౌంట్ NPAగా ప్రకటిస్తారు. అయితే, బ్యాంకు లోన్ తీసుకున్నవారిని డిఫాల్టర్‌గా ప్రకటించే కొన్ని ఇతర పరిస్థితులూ ఉంటాయి.

లోన్ తీసుకున్నవారు చనిపోతే లేదా భార్యాభర్తలు ఉమ్మడి దరఖాస్తుదారులుగా ఉండి విడాకులు తీసుకున్నట్లయితే.. అటువంటి పరిస్థితుల్లో కూడా EMI నిలిపివేయవచ్చు. అగ్రిమెంట్‌లో అటువంటి నిబంధనలను జాగ్రత్తగా చదవండి. మీరు ఫ్లోటింగ్ రేట్‌పై బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే.. దాని వడ్డీ రేట్లు బయటి బెంచ్‌మార్క్‌తో అంటే రేపో రేట్ తో లింక్ చేసి ఉంటాయి.

రెపో రేటులో మార్పు కారణంగా, హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఈ మార్పు త్రైమాసిక ప్రాతిపదికన జరుగుతుంది. ఈ నియమం బ్యాంకును బట్టి మారవచ్చు అయినప్పటికీ.. ఈ నిబంధన అగ్రిమెంట్‌లో ఉంటుంది. కొన్ని బ్యాంకులు బెంచ్‌మార్క్ రేటు మారిన వెంటనే తమ వడ్డీ రేట్లను రీసెట్ చేస్తాయి. అగ్రిమెంట్‌లో మీరు ఏ ప్రాతిపదికన లోన్ వడ్డీ రేటు మార్చుతారు అనేది తెలుసుకోవాలి. మాజీ బ్యాంకర్ – loan4msme వ్యవస్థాపకుడు, అమిత్ కుమార్ తన్వర్ మాట్లాడుతూ.. నిజానికి బ్యాంక్ హోమ్ లోన్ కోసం వన్ సైడ్ అగ్రిమెంట్ తో వస్తుంది. అందులో కస్టమర్‌కు ఎక్కువ హక్కులు ఉండవు. పైగా, ఒప్పందంలో ఉపయోగించిన భాష చాలా క్లిష్టంగా ఉంటుంది. అది సామాన్యులకు మాత్రమే కాదు, విద్యావంతులకు కూడా అర్థం కాదు.

బ్యాంక్ తరపున సంతకం చేసే ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి అగ్రిమెంట్ నిబంధనలు – షరతులను తెలుసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ఏదైనా మోసాన్ని నివారించడానికి సరైన మార్గం అని చెప్పవచ్చు. ఈ సమయంలో, లోన్ కు సంబంధించిన వివిధ రకాల ఛార్జీల గురించి అర్థం చేసుకోండి. అందులో ఏదైనా తప్పు అనిపిస్తే.. ఆ నిబంధనను తీసివేయమని అడగండి. లోన్‌తో పాటు బ్యాంక్ విక్రయిస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్‌లను తగ్గించడానికి చర్చలు జరపండి. దీని ద్వారా మీరు మోసాలను నివారించవచ్చు. దీర్ఘకాలంలో భారీ సేవింగ్స్ కూడా చేయవచ్చు.

Published: October 13, 2023, 15:24 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.