మూడు నెలల క్రితం తన కూతురిని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మోహిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఇంజనీర్‌గా ఎదుగుతుందని కలలు కన్నాడు. మోహిత్‌కి ఆనందంతో పాటు మరింతగా బాధ్యత పెరిగింది. అతను ఇప్పటికే తన కుమార్తె ఉజ్వల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాడు. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టమని అతని స్నేహితుడు సలహా ఇచ్చాడు. కుమార్తె ఉన్న తల్లిదండ్రుల కోసమే ఈ పథకం. ఇది అధిక వడ్డీతో పాటు పన్నును ఆదా చేస్తుంది. ఈ పథకం ద్వారా మోహిత్ తన కుమార్తె చదువు కోసం లక్షల రూపాయిలు ఎలా ఆదా చేస్తాడో చూద్దాం.
SSYలో పెట్టుబడి పెట్టడానికి మీరు భారత పౌరుడై ఉండాలి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో ఖాతాను ప్రారంభించొచ్చు. అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖలో స్టార్ట్ చేయవచ్చు. మీరు కనీసం రూ. 250తో దీనిని తెరవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో డిపాజిట్ చేయవచ్చు.
అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు సుకన్య సమృద్ధి ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ తర్వాత 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత, కుమార్తె వివాహానికి డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఆమె సుకన్య సమృద్ధి ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50% విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఈ డబ్బును అమ్మాయిల చదువు ఖర్చుల కోసం మాత్రమే విత్ డ్రా చేయడానికి అనుమతి ఉంటుంది.
SSY ఖాతా అకాల ఉపసంహరణ
సడన్ గా విత్ డ్రా చేయడానికి లేదా మెచ్యూరిటీకి ముందు విత్ డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి ఉంది. అయితే, SSY ఖాతాను తెరిచిన 5 సంవత్సరాల తర్వాత కొన్ని షరతులలో దీనికి పర్మిషన్ ఇస్తారు. ఖాతాదారుని మరణం, ఖాతాదారుడికి తీవ్రమైన అనారోగ్యం, ఖాతాను నిర్వహించే తల్లిదండ్రుల మరణం.. ఇలాంటి సందర్భాలలో మాత్రమే దీనికి అనుమతి ఉంటుంది.
SSY వడ్డీ రేటు
FY 24 జనవరి-మార్చి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేటును 8.2%గా నిర్ణయించింది. ప్రతి మూడునెలలకోసారి వడ్డీ రేటును సవరిస్తారు. పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే.. అకౌంట్ హోల్డర్స్ కు అత్యధిక వడ్డీ రేటు 9.2%, అతి తక్కువ వడ్డీ రేటు 7.6% గా ఉంది.
SSY కాలిక్యులేటర్
సుకన్య యోజన ద్వారా మోహిత్ తన కుమార్తె భవిష్యత్తు కోసం ఎంత డబ్బు పోగుచేయగలడో ఓసారి చూద్దాం. మోహిత్ తన కుమార్తె పేరు మీద తెరిచిన సుకన్య ఖాతాలో ఏడాదికి 1.5 లక్షలు లేదా నెలకు 12,500 రూపాయలు డిపాజిట్ చేశాడనుకుందాం. అతను 15 సంవత్సరాలుగా అకౌంట్ రన్ చేస్తున్నాడు. అతను 21 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ వస్తుంది. కాబట్టి స్కీమ్ పిరియడ్ ముగిశాక.. అతని కుమార్తె దాదాపు 70 లక్షలు లేదా సరిగ్గా చెప్పాలంటే ఆమె ఉన్నత విద్య కోసం 69,80,093 రూపాయలను పొందుతుంది. మొత్తం డిపాజిట్ రూ.22.5 లక్షలు. అంటే, అతను మూడు రెట్లు తిరిగి పొందుతాడన్నమాట.
వడ్డీ రేటు ప్రతీ క్వార్టర్ కు కాంపౌండ్ అవుతుంది. త్రైమాసిక ప్రాతిపదికన మార్పు ఉంటుంది. అంటే మెచ్యూరిటీ మొత్తం అంచనాల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు.
SSY అనేది ట్రిపుల్ E (మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు) కేటగిరీ పథకం. అంటే పెట్టుబడి మొత్తం, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, మీరు పెట్టుబడులపై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు పొందే వడ్డీ కూడా పన్ను రహితం. మెచ్యూరిటీ సమయంలో మీ కుమార్తె పొందే డబ్బుపై కూడా పన్ను ఉండదు.
సుకన్య సమృద్ధి యోజన కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి భయపడేవారికి, స్థిరమైన రాబడిని కోరుకునే వారికి మంచి ఆప్షన్ అని చెప్పాలి. సుకన్య యోజనలోని డబ్బు సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న చిన్న పొదుపు పథకం. మీ కుమార్తె బాలికగా ఉన్నప్పుడు సుకన్య లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. దీనివల్ల మీరు మీ లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి వీలవుతుంది. మీకు సుదీర్ఘ పెట్టుబడి కాలవ్యవధి ఉంటే మాత్రమే సుకన్య యోజనలో పెట్టుబడి పెట్టండి.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.