వేచి, చూసి నిర్ణయం తీసుకోండి అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పై మంచి రిటర్న్స్!

చాలా సందర్భాలలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిశోధన, విశ్లేషణ ద్వారా, పెట్టుబడిదారులు తమ లాభాలు

వేచి, చూసి నిర్ణయం తీసుకోండి అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పై  మంచి రిటర్న్స్!

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు.. స్కీమ్‌కు సంబంధించిన మార్పుల గురించి సమాచారాన్ని మీకు ఈమెయిల్‌ లేదా SMS ద్వారా పంపిస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్త స్కీమ్ అయినా… దానికి సంబంధించిన ఏదైనా రిస్క్ అయినా… ఖర్చు నిష్పత్తికి సంబంధించిన సమాచారం అయినా… లేదా ఏదైనా రూల్స్ లో మార్పు అయినా… ఇలాంటి సమాచారాన్ని పెట్టుబడిదారులతో షేర్ చేసుకుంటుంది.

మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే ఇటువంటి సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఈమెయిల్స్ లేదా SMSలను జాగ్రత్తగా చదవాలి. వీటిలో సమాచారం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీకు ఈ ఈమెయిల్ పంపిందని అనుకుందాం: “XYZ AMC బోర్డ్… XYZ స్మాల్ క్యాప్ ఫండ్‌తో XYZ మిడ్ క్యాప్ ఫండ్ ను విలీనం చేసే ప్రతిపాదనను ఆమోదించింది .” కొంతమంది పెట్టుబడిదారులు దీనిని చదివిన తర్వాత భయాందోళనలకు గురవుతారు. తమ పెట్టుబడులను రీడీమ్ చేసుకుంటారు. కానీ, ఇలాంటి విలీన వార్తలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.

ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనం అంటే ఏమిటి? ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

మ్యూచువల్ ఫండ్స్ విలీనం కింద… మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ను.. కంపెనీలో ఉన్న మరో స్కీమ్‌తో విలీనం చేస్తారు. కొన్నిసార్లు రెండు స్కీమ్‌లను విలీనం చేసి కొత్త స్కీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో, పెట్టుబడిదారులకు అవకాశం ఇస్తారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పెట్టుబడి లక్ష్యాలు, వ్యయ నిష్పత్తి, రిస్క్ ప్రొఫైల్, ట్యాక్స్ ఫ్రంట్‌లో కూడా విలీనం మార్పులను తీసుకురావచ్చు.

ఉదాహరణకు… ఇటీవల, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ విలీనం చేయాలని నిర్ణయించుకుంది. దీని కింద, కంపెనీ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ CRISIL IBX AAA మార్చి 2024 ఇండెక్స్ ఫండ్‌ను.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కార్పొరేట్ బాండ్ ఫండ్‌తో విలీనం చేసింది.

ఈమధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనం… ఏప్రిల్ 2, 2024 నుండి అమల్లోకి వస్తుంది. అయితే, విలీనం తర్వాత, ఇప్పటికే ఉన్న స్కీమ్‌ల పేర్లు, ఇతర ఫీచర్‌లు మారవు. అలాగే వాటి ప్రయోజనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. యూనిట్ హోల్డర్లపైనా ప్రభావం పడదు.

మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎందుకు విలీనం అవుతాయి అనేది పెద్ద ప్రశ్న.

మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు అనేక కారణాల వల్ల మ్యూచువల్ ఫండ్ పథకాలను విలీనం చేస్తాయి… కొన్ని ముఖ్యమైన కారణాలను చూస్తే.. నిర్వహణ ఖర్చులను తగ్గించడం, పథకాన్ని సరళీకృతం చేయడం, పోర్ట్‌ఫోలియో నిర్వహణను మెరుగుపరచడం, పథకాల కార్యకలాపాలను సులభతరం చేయడం దీని ఉద్దేశం.

మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనం పథకం ప్రాథమిక లక్షణాలను మారుస్తుందని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పథకాల విలీనం పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోపై కూడా ప్రభావం చూపుతుంది.

మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు స్కీమ్‌ల విలీనం, ఆస్తుల కేటాయింపు, స్కీమ్ లక్ష్యాలు, పన్ను చిక్కులు, ఇతర సంబంధిత సమాచారాన్ని ఈమెయిల్, SMS ద్వారా రాతపూర్వక సమాచారాన్ని పెట్టుబడిదారులకు ఇవ్వాలి. మీకు విలీనానికి సంబంధించిన మెసేజ్ వస్తే, భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ రెగ్యులేటర్ SEBI నిబంధనల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు పెట్టుబడిదారులకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా పెట్టుబడి నుండి ఎగ్జిట్ అవకాశాన్ని కల్పించాలి. కొన్ని సందర్భాల్లో, కంపెనీలు పెట్టుబడి పథకం నుండి బయటకు వచ్చేయడానికి కొన్ని ఛార్జీలను విధిస్తాయి, దీనిని ఎగ్జిట్ లోడ్ అంటారు.

సెబీ నిబంధనల ప్రకారం, ఫండ్ హౌస్ కనీసం 30 రోజుల ఎగ్జిట్ లోడ్ లేని విండోను అందించాలి. ఈ సమయంలో, పెట్టుబడిదారులు సమ్మతి పత్రాన్ని ఇవ్వడం ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేయవచ్చు.

ఈ సమయంలో, మరొక విషయం గుర్తుంచుకోండి. నిర్ణీత గడువులోపు కంసెంట్ ఇవ్వలేని వారు… ఆ రోజు నికర ఆస్తి విలువ ప్రకారం వారి యూనిట్లు రీడీమ్ చేస్తారు. విలీనానికి అంగీకరించిన ప్రస్తుత పెట్టుబడిదారులు.. తమ పథకాలలో పెట్టుబడి పెట్టడాన్ని కంటిన్యూ చేయవచ్చు.

ఫిన్‌వైజర్ ఫౌండర్, CEO అయిన జే షా ప్రకారం.. “పెట్టుబడిదారులు కొత్త పథకం లక్ష్యాలు, ఫీజుల స్ట్రక్చర్, పన్ను చిక్కులు వంటి కొన్ని మార్పులపై ఒక కన్నేసి ఉంచాలి. ఫండ్ మేనేజర్‌ల ట్రాక్ రికార్డ్‌పై కూడా నిఘా ఉంచాలి.” పెట్టుబడిదారులు విలీన పథకంలో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే… వారు 30 రోజులలోపు దానిని కూడా ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. అటువంటి సందర్భాలలో ఎటువంటి ఎగ్జిట్ లోడ్ వర్తించదు.”

విలీనం సమయంలో పెట్టుబడిదారులు ఏం చేయాలి?
సర్క్యులర్‌లోని విలీనం లక్ష్యాలను జాగ్రత్తగా చదవండి. మీ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం చూపే పన్ను చిక్కుల గురించి తెలుసుకోండి. ఖర్చు నిష్పత్తిని చెక్ చేయండి. అంటే పెట్టుబడిపై ఖర్చు. ఫండ్ హౌస్ కొత్త ప్రకటనలపై అప్‌డేట్‌గా ఉండండి. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్‌ను చెక్ చేయండి. కొత్త పథకం లక్ష్యాలు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి.. సురక్షితమైన పెట్టుబడిగానే చెప్పచ్చు. కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనాన్ని నిశితంగా గమనించాలి. ఎందుకంటే పెట్టుబడిదారులకు తమ పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవడానికి కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనం తర్వాత ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ను విక్రయించాలనుకుంటే.. అప్పుడు వారు మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి రావచ్చు.

చాలా సందర్భాలలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిశోధన, విశ్లేషణ ద్వారా, పెట్టుబడిదారులు తమ లాభాలు, నష్టాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పథకాల విలీనాన్ని అర్థం చేసుకోవడంలో ఏదైనా సమస్య లేదా గందరగోళం ఉంటే, మీ ఆర్థిక సలహాదారుని సహాయం తీసుకోండి.

Published: March 20, 2024, 17:16 IST