బీమా కంపెనీల దగ్గరున్న ఆ రూ.25,000 కోట్లలో మీ డబ్బుందా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఎలా కనుక్కోవాలి? క్లెయిమ్ చేయని మొత్తం గురించి తెలుసుకోవడానికి, IRDAI.

alternate

బ్యాంకుల మాదిరిగానే ఇప్పుడు బీమా కంపెనీలు కూడా తమ ఖాతాదారులు మర్చిపోయిన సొమ్మును వారికి తిరిగి ఇవ్వబోతున్నాయి. క్లెయిమ్ చేయని మొత్తం పెరగడంపై రెగ్యులేటర్ తో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI.. అన్‌క్లెయిమ్ చేయని బీమా మొత్తానికి సంబంధించిన సర్క్యులర్‌ను జారీ చేసింది. IRDAI.. బీమా కంపెనీలకు ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పాలసీదారులకు అన్‌క్లెయిమ్ చేయని మొత్తాలను తిరిగి ఇవ్వాలంది. బకాయి ఉన్న మొత్తానికి చట్టబద్ధమైన హక్కుదారులను కనుక్కోవడానికి ప్రయత్నాలను మరింతగా పెంచాలని కోరింది. ఈ విషయంలో బీమా ఏజెంట్ల నుండి సహాయం తీసుకోవాలని చెప్పింది.

క్లెయిమ్ చేయని మొత్తం రూ.25,000 కోట్లు.. జీవిత బీమా కంపెనీల్లో జమ అయినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇందులో గరిష్టంగా 84 శాతం అంటే దాదాపు రూ. 21,000 కోట్లు ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ వద్ద ఉన్నాయి. ఈ మొత్తంలో మెచ్యూరిటీ, డెత్, సర్వైవల్ బెనిఫిట్స్ మొదలైన వాటికి సంబంధించిన మొత్తాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం, సెటిల్‌మెంట్ తేదీ నుండి ఆరు నెలల వరకు క్లెయిమ్ చేయకపోతే, ఆ మొత్తాన్ని అన్‌క్లెయిమ్ చేయనిదిగా పరిగణిస్తారు. IRDAI.. బీమా కంపెనీలను తమ వెబ్‌సైట్‌లో రూ. 1000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తమున్న పాలసీదారుల అన్‌క్లెయిమ్ మొత్తాల వివరాలను అందించాలని కోరింది.

ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో, IRDAI.. అన్‌క్లెయిమ్ చేయని మొత్తం నిర్వచనాన్ని కూడా సవరించింది. ఇప్పుడు, లిటిగేషన్‌లో ఉన్న పాలసీలు, క్లెయిమ్‌పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లేదా ప్రభుత్వ ఏజెన్సీల వల్ల ఫ్రీజ్ అయిన పాలసీలు.. ఈ విధంగా విత్‌హెల్డ్ చేయబడిన పాలసీలను అన్‌క్లెయిమ్‌గా పరిగణించరు. కస్టమర్‌లు లేదా లబ్ధిదారులను సంప్రదించలేని పాలసీలను అన్‌క్లెయిమ్ పాలసీల కేటగిరీలో ఉంచాలని రెగ్యులేటర్ స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే ఉన్నవారితోపాటు కొత్త కస్టమర్లందరి మొబైల్ నెంబర్‌లు ఈమెయిల్ IDలను ఐడెంటిఫై చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది.

రెగ్యులేటర్.. బీమా కంపెనీలకు ఐదు ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.

1. పాలసీ పునరుద్ధరణ సమయంలో కస్టమర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ను, నామినీని అప్‌డేట్ చేయాలి
2. కాంటాక్ట్ నెంబర్‌లు, బ్యాంక్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి పాలసీదారులను అనుమతించాలి
3. క్లెయిమ్ చేయని పాలసీ కస్టమర్‌లను చేరుకోవడానికి వివిధ మార్గాలను ఉపయోగించాలి
4. పాలసీదారులకు వారి పాలసీ మెచ్యూరిటీ గురించి కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాలి
5. బీమా చేయబడిన వారి KYC అసంపూర్తిగా ఉంటే, దానిని పూర్తి చేయాలి. మైనర్‌ల KYCని మళ్లీ చేయాలి

ఇన్సూరెన్స్ సెక్టార్‌లో అన్‌క్లెయిమ్ చేయని మొత్తం ఎందుకు పెరుగుతోందనేది ఇప్పుడు ప్రశ్న. పాలసీని విక్రయించేటప్పుడు బీమా ఏజెంట్లు చాలాసార్లు కస్టమర్ల పూర్తి, సరైన వివరాలను నమోదు చేయరని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాస స్థలాన్ని, మొబైల్ నెంబర్‌ను మార్చుకుంటారు. కొందరు వ్యక్తులు బీమా పాలసీని కొనుగోలు చేస్తారు. కానీ దాని డాక్యుమెంట్ లను వారి కుటుంబ సభ్యులతో పంచుకోరు. అలాంటి పాలసీదారులు ఈ లోకంలో లేకుంటే, వారి కుటుంబ సభ్యులు బీమా క్లెయిమ్ చేసుకోలేరు. నామినీకి అటువంటి పాలసీ గురించి తెలియదు. లేదా పాలసీ డాక్యుమెంట్లు అందుబాటులో ఉండవు. క్లెయిమ్ చేయని బీమా మొత్తం పెరగడానికి ఇదే ప్రధాన కారణం.

క్లెయిమ్ చేయని మొత్తానికి సంబంధించిన నియమం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బీమా కంపెనీ 10 సంవత్సరాల పాటు పాలసీ కోసం ఎలాంటి క్లెయిమ్‌ను అందుకోకపోతే, ఆ డబ్బు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కు అంటే SCWFకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన పథకాల్లో ఈ నిధిని ఉపయోగిస్తారు. బీమా చేసిన లేదా ఆధారపడిన సీనియర్ సిటిజన్ ఎవరైనా సంక్షేమ నిధికి బదిలీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల వరకు డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ఈ మొత్తాన్ని 25 ఏళ్లపాటు క్లెయిమ్ చేయకుంటే అది కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ ఫర్ అవుతుంది.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఎలా కనుక్కోవాలి? క్లెయిమ్ చేయని మొత్తం గురించి తెలుసుకోవడానికి, IRDAI.. బీమా కంపెనీలను వారి వెబ్‌సైట్‌లో సెర్చ్ సౌకర్యాన్ని అందించమని కోరింది. దీని సహాయంతో, పాలసీదారులు లేదా డిపెండెంట్లు తమ కంపెనీల వద్ద ఏదైనా క్లెయిమ్ చేయని మొత్తం ఉందో లేదో తెలుసుకోవచ్చు. క్లెయిమ్ చేయని మొత్తాన్ని తెలుసుకోవడానికి మీరు పాలసీదారు పేరు, పాన్ నెంబర్, పాలసీ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. బీమా కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని మొత్తాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. వారు ప్రతి ఆరు నెలలకోసారి ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

మీరు బీమా పాలసీని కొనుగోలు చేస్తుంటే, అందులో చిరునామా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID పూర్తి వివరాలను ఎంటర్ చేయండి. ఈ సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే, దానిని పాలసీలో అప్‌డేట్ చేయండి. మీ మొత్తం పెట్టుబడి వివరాలను ఆన్‌లైన్‌లో లేదా డైరీలో ఉంచండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ విషయంలో కొంచెం అశ్రద్ధ చేసినా, అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

 

Published: March 19, 2024, 18:50 IST

బీమా కంపెనీల దగ్గరున్న ఆ రూ.25,000 కోట్లలో మీ డబ్బుందా?