మీ గుర్తింపు చోరీ జరిగిందా..  ఇలా చేయండి

గుర్తింపు ధ్రువీకరణ అంటే ఏదో ఒక పత్రం కాదిప్పుడు. ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేయడానికి దొంగలకు ఒక ఆయుధంలాంటిది. 

ఎవరికి వారే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అప్పుడే మోసానికి గురవ్వకుండా కాపాడుకోగలం.

క్రెడిట్‌ బ్యూరో వద్ద మీ క్రెడిట్‌ నివేదికలను తీసుకోండి. వాటిని విశ్లేషించి, ఏమైనా అనధికార ఖాతాలున్నాయా చూసుకోండి.

ఎవైన తేడాలు కనిపిస్తే వెంటనే క్రెడిట్‌ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి. దర్యాప్తు చేసి, మీ నివేదికల్లో ఆ వివాదాస్పద అంశాలు తొలగిస్తారు.

ఆన్‌లైన్‌లోనూ, సామాజిక వేదికల ద్వారా పాన్‌, ఆధార్‌ను పంపించడం చాలా సర్వసాధారణం. దీన్ని అరికట్టాలి. 

మరీ అత్యవసరం ఉన్నప్పుడు, తెలిసిన వ్యక్తులకు మాత్రమే ఈ వివరాలు పంపించాలి. 

బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాలకు సంఖ్యలు, గుర్తులతో బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. 

బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ లాగిన్‌ సమాచారం, కార్డు సీవీవీ, ఓటీపీలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు. ఇ-మెయిల్స్‌లో వచ్చిన లింకులపై క్లిక్‌ చేయొద్దు. 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీ గుర్తింపు వివరాలు దొంగల చేతికి చేరితే..

పోలీసులకు ఫిర్యాదు: మీ సమీప పోలీస్‌ స్టేషనుకు వెళ్లండి. వివరాలను చెప్పి ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేయించండి. పోలీసులు దర్యాప్తు మొదలుపెడతారు.

క్రెడిట్‌ ఫ్రీజ్‌: ప్రధాన మూడు క్రెడిట్‌ బ్యూరోలను సంప్రదించడం ద్వారా క్రెడిట్‌ ఫ్రీజ్‌ చేయొచ్చు. దీనివల్ల మీ క్రెడిట్‌ నివేదికను మీ అనుమతి లేకుండా ఎవరూ చూడలేరు. ఇదీ మీ పేరిట దొంగలు ఖాతా   తెరవకుండా ఉపకరిస్తుంది.

బ్యాంకులను సంప్రదించండి: మీ గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్‌) జరిగిందన్న విషయాన్ని మీ ఖాతా ఉన్న బ్యాంకులకు తెలపండి. 

అపుడు ఏవైనా మోసపూరిత ఖాతాలుంటే రద్దు చేస్తారు. మీ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలేమైనా జరుగుతున్నాయోమో గమనించి చర్యలు తీసుకుంటారు.