పొలం అమ్మితే పన్ను కట్టాలా? వ్యవసాయ భూమిపై టాక్స్ ఎలా ఉంటుంది?

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన యాదయ్య తన వ్యవసాయ భూమిని మంచి ధర వస్తోందని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బును ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో పెట్టాలని భావించాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచన చేస్తున్న సమయంలో అతని స్నేహితుల్లో..

  • KVD varma
  • Last Updated : September 15, 2023, 20:55 IST

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన యాదయ్య తన వ్యవసాయ భూమిని మంచి ధర వస్తోందని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బును ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో పెట్టాలని భావించాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచన చేస్తున్న సమయంలో అతని స్నేహితుల్లో ఒకరు పొలం అమ్మగా వచ్చిన డబ్బుపై టాక్స్ కట్టాల్సి ఉంటుంది అని బాంబ్ పేల్చాడు. దీంతో అయోమయంలో పడ్డాడు యాదయ్య. ఎందుకంటే, యాదయ్య లాంటి అనేక మంది వ్యవసాయ భూమిని అమ్ముకున్న తరువాత వచ్చిన డబ్బుపై టాక్స్ ఉంటుంది అని తెలీదు. ఆ టాక్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలో అసలు అవగాహన లేదు. ఇప్పుడు మనం వ్యవసాయ భూమిని అమ్ముకుంటే టాక్స్ కట్టాలా? ఎటువంటి భూమిని అమ్మితే టాక్స్ కట్టాల్సి వస్తుంది? ఎటువంటి భూమిపై టాక్స్ కట్టే పని ఉండదు? టాక్స్ ను ఎలా ఆదా చేయవచ్చు వంటి విషయలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

వ్యవసాయ భూమి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది గ్రామీణ ప్రాంతాలు, అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూమి. రెండవది పట్టణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ భూమి. ఆదాయపు పన్ను చట్టం దృష్టిలో వ్యవసాయంలో ఉపయోగించే ప్రతి భూమి వ్యవసాయ భూమి కాదు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉండే వరకు మీ వ్యవసాయ భూమి ఆదాయపు పన్ను చట్టం కింద వ్యవసాయ భూమిగా పరిగణించే అవకాశం లేదు. ఉదాహరణకు.. – మీ వ్యవసాయ భూమి మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి వస్తే, దాని జనాభా 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఆ ప్రకారం ఈ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. ఆదాయపు పన్ను చట్టం… – మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు జనాభా 10 వేల కంటే ఎక్కువ అయితే 1 లక్ష వరకు ఉంటే… అప్పుడు 2 కిలోమీటర్ల పరిధిలో వచ్చే భూమిని కూడా వ్యవసాయ భూమిగా లెక్కించరు. మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు జనాభా 1 లక్ష కంటే ఎక్కువ అలాగే 10 లక్షల వరకు ఉంటే కనుక అప్పుడు అన్ని వైపులా 6 కిలోమీటర్ల వ్యాసార్థంలో వచ్చే ప్రాంతం వ్యవసాయ భూమిగా చూడరు. అదేవిధంగా, మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్‌లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నట్లయితే.. 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు.

ఇప్పుడు చెప్పుకున్న పరిధిలో మీ వ్యవసాయ భూమి లేకపోతె అది ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి రాదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈ వ్యవసాయ భూమిని మూలధన ఆస్తిగా పరిగణించరు. అందువల్ల దాని అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం పై మూలధన లాభం పన్ను విధించరు.
ఒకవేళ మీ వ్యవసాయ భూమి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిధిలో ఉంటే అది ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి వస్తుంది. దీనిని మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. వీటిని పట్టణ వ్యవసాయ భూములుగా వర్గీకరిస్తారు. ఈ భూముల విక్రయం ద్వారా వచ్చే లాభంపై మూలధన రాబడి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు భూమిని కొనుక్కుని దానిని 24 నెలల తర్వాత విక్రయిస్తే దానిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు దీనిపై 20% పన్ను విధిస్తారు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన 24 నెలలలోపు అమ్ముకుంటే కనుక లాభంపై స్వల్పకాలిక మూలధన లాభం పన్ను ఎఫెక్ట్ అవుతుంది. దీనిపై మీ పన్ను స్లాబ్ ప్రకారం మూలధన లాభం మొత్తంపై పన్ను లెక్కిస్తారు. మీరు సెక్షన్ 54 (B) కింద మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ద్వారా మూలధన లాభం పన్నును ఆదా చేసుకోవచ్చు.

కొన్ని నిబంధనలు-షరతులు

  • వ్యక్తి లేదా అతని కుటుంబం ఈ భూమిని విక్రయించిన తేదీ కంటే రెండు సంవత్సరాల వరకు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించాలి.
  • ఇంతకు ముందు ఉన్న భూమిని అమ్మిన రెండేళ్లలోపు కొనుగోలు వ్యవసాయ భూమిని కొనాలి. రెండవ వ్యవసాయ భూమి ఏదైనా గ్రామీణ లేదా పట్టణ వ్యవసాయ భూమి కావచ్చు.
  • అలాగే, కొత్త వ్యవసాయ భూమిని 3 సంవత్సరాల వరకు అమ్మడానికి కుదరదు. ఒకవేళ 3 సంవత్సరాల కంటే ముందు అమ్ముకుంటే అంతకు ముందు ఇచ్చిన పన్ను మినహాయింపు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆ టాక్స్ కట్టాల్సి వస్తుంది.

మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే పట్టణ వ్యవసాయ భూమిని అమ్మడం ద్వారా వచ్చే మూలధన లాభాలపై సెక్షన్ 54F ప్రకారం పన్నును ఆదా చేయవచ్చు అని పన్ను – పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెబుతున్నారు. దీని కోసం, మూలధన లాభం కాకుండా, భూమిని అమ్మడం ద్వారా పొందిన మొత్తం డబ్బు అంతా ఇల్లు కొనడానికి ఉపయోగించాలి. భూమిని అమ్మిన రెండేళ్లలోపు ఇల్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు.

ఒకవేళ మీరు భూమిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు సొంతంగా నిర్మించుకుంటే కనుక ఆ ఇల్లు 3 సంవత్సరాలలోపు కట్టాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే మీరు భూమినిఅమ్మిన తేదీకి ఒక సంవత్సరం ముందు ఏదైనా ఇల్లు కొని ఉంటే దానిపై కూడా 54F కింద మినహాయింపు కూడా తీసుకోవచ్చు. భూమి అమ్మగా వచ్చిన డబ్బును మీరు సెక్షన్ 54EC కింద క్యాపిటల్ గెయిన్ బాండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు అని బల్వంత్ జైన్ చెప్పారు.

యాదయ్యలా కాకుండా.. మీరు ఎప్పుడు పన్ను చెల్లించాలి.. ఎప్పుడు వ్యవసాయ భూమిని విక్రయించకూడదో అర్థం చేసుకోవాలి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి సెక్షన్ 54F కింద, 10 కోట్ల రూపాయల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. 10 కోట్ల కంటే ఎక్కువ మూలధన లాభంపై పన్ను విధిస్తారు.

 

Published: September 15, 2023, 20:55 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.