సతీష్ ఈ మధ్యకాలంలో ఇల్లు కొనాలని ప్రయత్నిస్తున్నాడు. హైటెక్ సిటీ దగ్గరలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో పదేళ్ళ నాటి ఫ్లాట్ ఒకటి కొనాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించిన డీల్ మొత్తం పూర్తీ అయింది. కానీ.. పాత ప్రాపర్టీ పై లోన్ వస్తుందా? రాదా? అనే విషయంపై అతనికి సందేహం ఉంది. అతనికి తెలిసిన వారంతా.. కొత్తగా నిర్మించిన ఇళ్ళపై లోన్స్ తీసుకున్నారు. వారిలో ఎవరూ పాత ప్రాపర్టీ కొనలేదు. దాంతో సతీష్ ఏమి చేయాలా అని ఆందోళన పడుతున్నాడు. అయితే, సతీష్ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోన్ కోసం ప్రాపర్టీ పాతదా.. కొత్తదా అనే పట్టింపు లేదు. అతను పాత సొసైటీలో ఫ్లాట్ కొనడానికి హోమ్ లోన్ పొందవచ్చు. అయితే, ఎవరైనా హోమ్ లోన్ పొందగలరా? లేదా? అనే దానిపై ప్రభావం చూపే కొన్ని అంశాలు ఉన్నాయి.
రుణం ఇవ్వడానికి ముందు, బ్యాంక్ ఇల్లు ఉన్న ప్రదేశం అలాగే దాని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంది. నిర్మాణాన్ని లోకల్ అధరిటీస్ ఆమోదంతో నిర్మించినట్టయితే.. లోన్ సాంక్షన్ చేయడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ఇంటి వయస్సు ఎలాంటి పాత్ర పోషించదు. అమోదించిన హోమ్ లోన్ మొత్తం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదట, ఆస్తి మార్కెట్ విలువ అలాగే రెండవది, కొనుగోలుదారు ఆర్థిక స్థితి పై ఆధార పడి ఉంటుంది అని బ్యాంకింగ్ నిపుణుడు సురేశ్ బన్సాల్ చెబుతున్నారు. వయస్సు, క్రెడిట్ హిస్టరీ, నెలవారీ ఆదాయం, కొనుగోలుదారుడు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగల సామర్థ్యం అన్నిటినీ బేరీజు వేసిన తరువాత వారు ఎంత లోన్ కోసం అర్హులో నిర్ణయిస్తారు. అయితే, బ్యాంకు మొదటగా ఆస్తికి సంబంధించిన వాల్యుయేషన్, చట్టపరమైన విచారణను నిర్వహిస్తుంది. వీటిలో ఎ ఒక్కదాన్నీ వదలకుండా బ్యాంకులు పరిశీలిస్తాయి.
పాత ప్రాపర్టీ విలువను నిర్ధారించడానికి, బ్యాంకులు నిపుణుల సహాయాన్ని కోరుతాయి. ఇందుకోసం వారు ఏజెన్సీలను నియమించుకున్నారు. కొన్ని బ్యాంకులు తమ ప్రొఫెషనల్ ప్యానెల్‌లో కనస్ట్రక్షన్ ఎక్స్ పర్ట్ ని కూడా ఉంచుతాయి. లోన్ శాంక్షన్ చేయడానికి ముందు, బ్యాంకులు వాటి ద్వారా ప్రాపర్టీ వాల్యూ నిర్ణయిస్తాయి. సమీపంలోని ప్రాపర్టీల పరిస్థితి, ఆ ప్రదేశం.. అక్కడి ధరలు నిర్దిష్ట ప్రాపర్టీ వాల్యూ అంచనా వేయడానికి ఆధారంగా ఉంటాయి. వాల్యుయేషన్ టీం రిపోర్ట్ ఆధారంగా, లోన్ మొత్తం ఆమోదిస్తారు.
లీగల్ రిపోర్ట్ కూడా ఉండాలి. బ్యాంకింగ్ – హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఇచ్చే ముందు లోన్ రీపేమెంట్ నిర్ధారించుకుంటాయి. వివాదాస్పదమైన లేదా మోసపూరితమైన ఆస్తిని ఏ వ్యక్తి తాకట్టు పెట్టడం లేదనీ.. అలాగే అటువంటి ప్రాపర్టీ తీసుకుని లోన్ కోసం ప్రయత్నం చేయడం లేదనీ బ్యాంకులు నిర్ధారించుకుంటాయి. అందుకోసం ప్రాపర్టీ పై పూర్తీ స్థాయిలో విచారణ చేస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా లీగల్ ఎడ్వైజర్లను బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటాయి. వీరిద్వార బ్యాంకులు లోన్ కోసం వచ్చిన ప్రాపర్తీపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాయి. ఈ చట్టపరమైన టీం ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సేల్ డీడ్ వెరిఫై చేస్తుంది. అలాగే ప్రాపర్టీ ఎన్నిసార్లు ఇంతకూ ముందు అమ్మకానికి వెళ్ళింది.. ఎక్కడైనా చట్టపరమైన వివాదాలతో చిక్కుకుందా వంటి అంశాలనూ పరిశీలిస్తుంది. ఇవన్నీ క్లియర్ గా ఉంటె లీగల్ టీం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మాత్రమె బ్యాంక్ లోన్ ఫైల్ పై ముందుకు వెళుతుంది.
లోన్ మొత్తం ఎంత ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. సతీష్ ఆసక్తి చూపుతున్న ప్రాపర్టీ మార్కెట్ విలువ రూ.50 లక్షలు. సర్కిల్ రేటు ప్రకారం ఫ్లాట్ ధర రూ.40 లక్షలు. సతీష్ కు చక్కటి నెలవారీ జీతం, మంచి క్రెడిట్ హిస్టరీ అలాగే ఇతర EMIలు లేవు. అందువల్ల బ్యాంక్ ప్రాపర్టీ విలువలో 85% వరకు రుణాన్ని అందించవచ్చు. ప్రస్తుతం సతీష్ వయస్సు 40 సంవత్సరాలు. అటువంటప్పుడు, అతను సులభంగా 20 సంవత్సరాల రీపెమేంట్ షెడ్యూల్ తో లోన్ పొందవచ్చు. శాంక్షన్ అయిన లోన్ మొత్తాన్ని ఫ్లాట్ వయస్సు ప్రభావితం చేయదు.
ఒకవేళ, సతీష్ లాగా, మీరు కూడా పాత ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీరు ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పటికే ఉన్న సొసైటీలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి కూడా హోం లోన్ పొందవచ్చు. అయితే, మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు దాని పరిస్థితి అలాగే అది ఉన్న ప్రదేశాన్ని క్షుణ్ణంగా అంచనా వేసుకున్నారని నిర్ధారించుకోండి, తద్వారా మీరు మీ నిర్ణయానికి తర్వాత బాధపడే అవసరం రాదు.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.
Trending 9
Exclusive