ఏ వయసుకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి?

రాజేష్ తమ్ముడు అభిషేక్ సంతోషంగా ఉన్నాడు. అతని సంతోషం చూసి రాజేష్ ఏమిటి విశేషం చాలా సంతోషంగా ఉన్నావు? అని అడిగాడు. తనకు కొద్ది సేపట్లో ఐఫోన్ 14 ప్రో వస్తోంది అని చెప్పాడు. దానికి రాజేష్ ఆశ్చర్యపోయాడు. ఆరునెలల క్రితమే కదా కొత్త ఫోన్ కొన్నావు? మళ్ళీ..

  • KVD varma
  • Last Updated : August 18, 2023, 21:01 IST

రాజేష్ తమ్ముడు అభిషేక్ సంతోషంగా ఉన్నాడు. అతని సంతోషం చూసి రాజేష్ ఏమిటి విశేషం చాలా సంతోషంగా ఉన్నావు? అని అడిగాడు. తనకు కొద్ది సేపట్లో ఐఫోన్ 14 ప్రో వస్తోంది అని చెప్పాడు. దానికి రాజేష్ ఆశ్చర్యపోయాడు. ఆరునెలల క్రితమే కదా కొత్త ఫోన్ కొన్నావు? మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫోన్ కొంటున్నావా అని అడిగాడు తమ్ముడిని. అవును.. మొన్న కొన్న ఫోన్ పాతది అయిపొయింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ వెర్షన్ అని చెప్పాడు. నువ్వు పోయిన నెలలోనే 25 వేల రూపాయలు పెట్టి స్మార్ట్ వాచ్ కొన్నావు కదా అని అడిగాడు రాజేష్. అవును అని చెప్పాడు అభిషేక్. కొత్తగా ఉద్యోగం వచ్చింది కదా.. అందుకే అన్నీ కొంటున్నాను. మనం సంపాదించేది ఖర్చు చేయడానికే కదా.. ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు పెడతాం? అని తన అన్నకు చెప్పాడు అభిషేక్. అవును ఖర్చు పెట్టు తప్పులేదు.. కానీ, కొంత మొత్తం అయినా సేవింగ్స్ చేసుకోవాలి అని సలహా ఇచ్చాడు రాజేష్. అయితే.. అభిషేక్ రాజేష్ మాటను పట్టించుకోలేదు.

అభిషేక్ వయసు దాదాపు 23 ఏళ్ళు ఉంటుంది. ఎక్కువగా 20-25 సంవత్సరాల వయసు మధ్యలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకున్న యువత సేవింగ్స్ కంటే ఖర్చు చేయడం వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. జీవితమంతా పొదుపు చేయాలా? ఇప్పుడు అసలే తక్కువ జీతం ఎంత దాచుకోగలుగుతాం. ఖర్చు చేయగా మిగిలితే చూద్దాం. రేపు జీతాలు పెరిగితే అప్పుడు సేవింగ్స్ గురించి ఆలోచిద్దాం అని భావిస్తూ ఉంటారు. సరిగ్గా ఇటువంటి తప్పుడు భావంతోనే యువత ఉంటుంది. ఇక్కడే వారు తప్పు చేస్తారు. సేవింగ్స్ లేకుండా మొత్తం డబ్బు ఖర్చు చేసేస్తారు. దీనివలన భవిష్యత్ లో ఇబ్బందులు పడతారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మార్పులు అవసరం. అయితే, మార్పులు ఎందుకు అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తి తన 20 ఏళ్ల వయస్సులో సంపాదించడం ప్రారంభిస్తాడు అనుకుందాం. అతని సంపాదనలో ఎక్కువ భాగం తినడం, తాగడం, జీవించడం, ప్రయాణం చేయడం, అభిరుచులను నెరవేర్చుకోవడం అలాగే కొన్ని సందర్భాల్లో ఎడ్యుకేషన్ లోన్ తిరిగి చెల్లించడం కోసం అయిపోతుంది.   నిజానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ వయస్సు నుంచే ప్రారంభం అవ్వాలి. మొదట, మీరు మీ ఎడ్యుకేషన్ అప్‌గ్రేడేషన్‌ను లక్ష్యంగా చేసుకోవాలి. మీ జీతం ఎక్కువగా లేకపోయినా, మీరు దానిలో 10-15% ఆదా చేసుకోవాలి. తద్వారా మీరు ఉన్నత చదువులు చదవవచ్చు. మరింత సంపాదించవచ్చు.

ఫైనాన్షియల్ టార్గెట్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఈక్విటీ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. మీకు ప్రయాణం చేయడం లేదా కారు లేదా బైక్ కొనడం వంటి స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటే, మీరు డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అసెట్ అలోకేషన్ అనేది మీ డబ్బును ఈక్విటీ, బంగారం, బాండ్లు లేదా ఇతర అసెట్ క్లాస్‌లలో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టడం. అలాగే, 6 నెలల జీతంతో సమానమైన అత్యవసర నిధిని క్రమంగా ఏర్పాటు చేసుకోండి. ఇది కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది.

30వ సంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి సంపాదనతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి.పెళ్లి.. పిల్లలతో..ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు కొనాలనే కొత్త లక్ష్యాలు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన మొదలువుతుంది. అలాగే 30 నుంచి 39 సంవత్సరాల వయస్సు చాలా ముఖ్యం. . ఈ వయసులో ఇన్వెస్ట్మెంట్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తికి అతని ఆర్థిక స్థానం ఎప్పుడూ చక్కగా ఉంటుంది.

పెరుగుతున్న బాధ్యతలతో, ముందుగా టర్మ్ – మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి.తద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కుటుంబ ఆర్థిక భద్రత చెక్కుచెదరకుండా ఉంటుంది.ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించండి. పిల్లల చదువుల కోసం – ఇల్లు కొనడం కోసం, క్రమంగా పెట్టుబడులు పెట్టండి. ఇల్లు కొనాలంటే, మీరు ఎంత పెద్ద ఇంటిని కొనుగోలు చేయవచ్చో చూడాలి, తద్వారా మిగిలిన ఫైనాన్షియల్ టార్గెట్స్ రాజీపడకుండా ఉంటాయి. ఈ వయసులో మీరు రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచించాలి. చిన్న పెట్టుబడి పెట్టినా… ఈపీఎఫ్ లేదా ఎన్ పీఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీరు ఉద్యోగం మారుతున్నప్పుడు ఈ డబ్బును వెనక్కి తీసుకోకండి.

40 నుంచి 49 సంవత్సరాల వయస్సులో, మీ జీతం దాని గరిష్ట స్థాయికి పెరుగుతుంది. ఇప్పుడు ఖర్చులు వేగంగా పెరుగుతాయి ఎందుకంటే పిల్లల చదువుకు అయ్యే ఖర్చు పెరుగుతోంది. మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ముందుగా చేయకపోతే, ఇక్కడ మీ వయస్సుకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. మీరు పిల్లల చదువు కోసం లోన్ పొందవచ్చు, కానీ పదవీ విరమణ కోసం లోన్ అందుబాటులో ఉండదు. జీవితంలోని ఈ దశలో, మీరు రిటైర్మెంట్ కోసం మీ జీతంలో కనీసం 30-35% ఆదా చేసుకోవాలి.

మీరు మీ 50 ఏళ్ల వయస్సులో ఉన్న సమయానికి, మీరు పదవీ విరమణ కోసం స్థిరంగా పెట్టుబడి పెట్టాలి. ఈక్విటీలు మీ రిటైర్‌మెంట్ అసెట్ కేటాయింపులో 60 నుంచి 70 శాతం వరకు ఉండవచ్చు, ఎందుకంటే మీకు సుదీర్ఘ జీవితకాలం ఉంది. కాలక్రమేణా ఈక్విటీ భాగాన్ని క్రమంగా తగ్గించాలి. పిల్లల ఉన్నత చదువుల కోసం మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ వంటి ఏదైనా అధిక వడ్డీ రేటు లోన్ ఉన్నట్లయితే, దానిని తీసివేయడానికి ప్రయత్నించండి.

మీరు 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు మీకు సాధారణ ఆదాయం అవసరం. అలాగే, మీ వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీకు తదుపరి 3 నుంచి 5 సంవత్సరాలకు అవసరమైన మొత్తాన్ని డెట్ ఫండ్స్ లేదా స్థిర ఆస్తులలో సేవ్ చేయవచ్చు. దీనిని మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉంచండి. అదేవిధంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత అవసరమయ్యే డబ్బును ఈక్విటీ ఫండ్‌లో వదిలివేయండి. తద్వారా మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

మీరు కూడా అభిషేక్ లాగా పొదుపు చేయకపోతే, వెంటనే పొదుపు చేయడం ప్రారంభించి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడే ప్రారంభించండి. ఎందుకంటే మీ చిన్న వయసులో ఆదా చేసిన డబ్బు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. మీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుండగా, మీరు ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని పెంచుకుంటూ ఉండాలి. దీర్ఘకాలికంగా, ఈక్విటీ 10 నుంచి 12 శాతం రాబడిని ఇస్తుంది.మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తూ ఉండండి. తద్వారా కొరత ఏర్పడితే, పెట్టుబడులను పెంచడం ద్వారా మీ ఫైనాన్షియల్ టార్గెట్స్ పెంచుకోవచ్చు.

Published August 18, 2023, 21:00 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.