ధీరజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే, తన ఏడాది కూతురు ఆర్య కోసం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇప్పడు పిల్లల పేరుతొ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి పిల్లల పేరుపై ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్ అవసరం లేదు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ ఇటీవల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు తమ పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో వారి స్వంత బ్యాంకు ఎకౌంట్స్ నుంచి పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది.
ధీరజ్ లక్ష్యం ఆర్య ఉన్నత విద్య. దీనికి అతనికి తగినంత సమయం ఉంది. అయితే పిల్లల ఉన్నత విద్య వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మీరు మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎలా ఎంచుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం, కానీ గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, పిల్లల కోసం లక్ష్యాలు లేదా కలలు ఎప్పుడూ ముందుగా నిర్ణయించలేము. వారి తదుపరి విద్య ఎంత ఖరీదైనదో మీరు అంచనా వేయలేరు. అందులోనూ ప్రత్యేకించి మీరు మీ బిడ్డను విదేశీ కాలేజీ లేదా యూనివర్సిటీలో చదివించాలని ఆశ పడుతుంటే. మరోవైపు దేశంలో కూడా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు కూడా నిరంతరం పెరుగుతూ వస్తోంది.
పిల్లల చదువుల సరైన ప్రణాళిక కోసం, మీరు మీ లక్ష్యానికి చేరువయ్యేలా కనీసం సంవత్సరానికి ఒకసారి మీ ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవాలి. మీ మ్యూచువల్ ఫండ్ లక్ష్యాన్ని సాధించడానికి, మీరు మీ పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ఆస్తులను చేర్చడం ద్వారా వైవిధ్యపరచాలి. ఇది రిస్క్ అలాగే అస్థిరతను తగ్గిస్తుంది. అలాగే, విభిన్న ఆదాయ మార్గాలను నిర్ధారిస్తుంది. పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు మీ పిల్లల భవిష్యత్తు లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
మీ పిల్లల ఉన్నత విద్య కోసం డబ్బు ఆదా చేయడానికి ఒక మార్గం మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP ద్వారా పెట్టుబడి పెట్టడం. ఇలా చేయడం ద్వారా, ముందుగా నిర్ణయించిన తేదీలో ఆటో డెబిట్ విధానం ద్వారా మీ ఎకౌంట్ నుంచి డబ్బు కట్ అయిపోతుంది. ఆటంకం లేకుండా మీ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతుంది. ధీరజ్ తన కుమార్తెకు 18-20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి గణనీయమైన కార్పస్‌ను కూడబెట్టాలని, తద్వారా ఉన్నత విద్య – భవిష్యత్తు కోసం కొన్ని ఫండ్స్ కేటాయించాలని కోరుకుంటున్నాడు.
అతను సాధారణంగా తక్కువ రిస్క్ ఉన్న సాంప్రదాయ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, ప్రతి నెలా 5,000 రూపాయల SIP పెట్టి, దాదాపు 7 శాతం వార్షిక రాబడిని అందుకుంటే, 20 సంవత్సరాల తర్వాత, అతని చేతిలో దాదాపు 26,19,827 రూపాయలు ఉంటాయి… అయితే , అతను 12 శాతం వార్షిక రాబడిని అందించే ఈక్విటీ ఫండ్‌లో SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అతను 20 సంవత్సరాల తర్వాత మొత్తం 49,95,740 రూపాయల కార్పస్‌ను పోగు చేయగలుగుతాడు.
మీరు పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగానే పెట్టుబడి పెట్టడం నిజంగా సహాయపడుతుందని ఇన్వెస్టోగ్రాహి వ్యవస్థాపకురాలు, CFP శ్వేతా జైన్ చెప్పారు. ఇది మీ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు కలపడానికి దారి తీస్తుంది. ఆలస్యంగా ప్రారంభించడం అంటే తక్కువ రాబడి అని అర్ధం చేసుకోవాలి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, వృద్ధిని కొనసాగించినట్లయితే, ప్రారంభానికి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని అదనపు సంవత్సరాలు గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.
పిల్లల కోసం పెట్టుబడి పెట్టడానికి, Uti నిఫ్టీ 50 ETF, DSP నిఫ్టీ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్- కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ మంచి పథకాలు. SIPలు మంచి పెట్టుబడి వ్యూహంగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి మంచి రాబడిని అందిస్తాయి. సౌకర్యవంతంగా ఉంటాయి. మీరు సరైన SIP పెట్టుబడుల ద్వారా మీ భవిష్యత్తు లక్ష్యాలను కూడా సాధించవచ్చు. కాబట్టి, మీ ఆర్థిక లక్ష్యాలు – రిస్క్ టాలరెన్స్ ప్రకారం నమ్మకమైన SIPని ఎంచుకోండి. ఆపై మీ పెట్టుబడి వృద్ధికి అవకాశం ఇవ్వండి.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.